మాక్ అసెంబ్లీ నిర్వహించిన ఎస్‌పీఆర్ స్కూల్ విద్యార్థులు

హసన్‌పర్తి (ఆంధ్రప్రభ): హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ శివారులోని ఎస్‌పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గురువారం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో విద్యార్థులు ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు, వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేల పాత్రలను పోషిస్తూ శాసనసభ కార్యకలాపాలను ప్రతిరూపంగా ప్రదర్శించారు. వైద్యం, విద్య, నిరుద్యోగం, వ్యవసాయం, పంటల మద్దతు ధర, గ్రామ, పట్టణాభివృద్ధి, అటవీ సంపద వంటి ప్రజా సమస్యలపై చర్చించి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల పాత్రల్లో ఉన్న విద్యార్థులు సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ దేశ అభ్యున్నతికి తోడ్పడేలా ఎదగాలని సూచించారు. రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పించేందుకే మాక్ అసెంబ్లీ నిర్వహించినట్లు తెలిపారు. మార్కులతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషగిరిరావు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే రాష్ట్ర, దేశ పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి విద్యార్థులకే ఉందన్నారు. కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రమేష్, ప్రసాద్, చంద్రమోహన్, శ్రీధర్, కళ్యాణి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.