మేడిపల్లిలో షాకింగ్ విద్యుత్ బిల్లు

మేడిపల్లిలో షాకింగ్ విద్యుత్ బిల్లు
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి రూ.94,035 బిల్లు.. మీటర్ లోపమా..? అధికారుల నిర్లక్ష్యమా..?
సాధారణ కుటుంబాన్ని కుదిపేసిన టీజిఎస్‌పీడీసీఎల్ బిల్లు.
మేడిపల్లి, ఆంధ్రప్రభ : నారపల్లి విద్యుత్ సెక్షన్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ పంచవటి కాలనీ రోడ్ నెం.1లో నివసిస్తున్న ఎన్. మహేష్ కుమార్ కుటుంబానికి వచ్చిన భారీ విద్యుత్ బిల్లు స్థానికంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రతి నెల రూ.2 వేల లోపే విద్యుత్ బిల్లు వచ్చే డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి ఈ నెల ఏకంగా రూ.94,035 బిల్లు రావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
టీజిఎస్‌పీడీసీఎల్ జారీ చేసిన బిల్-కమ్-నోటీసు ప్రకారం, కేవలం 32 రోజుల వ్యవధిలో 8,090 యూనిట్లు వినియోగించినట్లు నమోదు అయింది. గతంలో ఎప్పుడూ ఇంత భారీ వినియోగం నమోదు కాలేదని మహేష్ కుమార్ తెలిపారు. తమ ఇంట్లో ఎలాంటి భారీ విద్యుత్ పరికరాలు ఉపయోగించడం లేదని, సాధారణ వినియోగమే ఉంటుందని ఆయన మీడియాకు వెల్లడించారు.
ఈ ఘటనపై మహేష్ కుమార్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు స్పందించినట్లు సమాచారం. బిల్లులో సాంకేతిక లేదా రీడింగ్ లోపం జరిగి ఉండొచ్చని భావిస్తున్న అధికారులు ఫోన్ ద్వారా మహేష్ కుమార్‌ను సంప్రదించి బిల్లును సవరించే ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే సాధారణ గృహానికి లక్ష రూపాయలకు చేరువైన బిల్లు రావడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. మీటర్ రీడింగ్ విధానం, బిల్లింగ్ వ్యవస్థపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ సమగ్ర పరిశీలన చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
