ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: మంత్రి కొల్లు రవీంద్ర
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నిర్వహించిన ప్లాస్టిక్ వ్యర్థాల శుభ్రత కార్యక్రమంలో రాష్ట్ర భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం, ప్రజల్లో ఆరోగ్య సమస్యలు అధికమవుతున్నాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా ప్రతి పౌరుడిదని, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి చర్యల ద్వారా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను నదులు, సముద్రాల్లోకి విడుదల చేసి జలవనరులను కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణానికి హాని కలిగించే చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించదన్నారు. అలాగే రాబోయే అఖండ గోదావరి కుంభమేళా నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని బీచ్ పరిసరాలను పరిశుభ్రం చేశారు.
