కాలుష్య రహిత సమాజమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

కాలుష్య రహిత సమాజమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో భారీ సైకిల్‌ యాత్ర

రూ. కోటి వ్యయంతో గాలి నాణ్యత పర్యవేక్షణ డిజిటల్‌ బోర్డు ప్రారంభం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం శ్రీకాకుళం నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన నిరంతర పరిసర గాలి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ డిజిటల్‌ బోర్డును శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా నగరంలోని గాలి నాణ్యత, దుమ్ము, ధూళి కణాలు, పొగ తీవ్రత వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

అనంతరం మున్సిపల్‌ కార్యాలయం నుంచి పెద్దపాడులోని జ్యోతిరావు ఫూలే వెనుకబడిన వర్గాల సంక్షేమ గురుకుల పాఠశాల వరకు భారీ సైకిల్‌ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మంత్రి స్వయంగా సైకిల్‌ తొక్కుతూ పాల్గొని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

తదనంతరం నిర్వహించిన పర్యావరణ సదస్సులో మంత్రి మాట్లాడుతూ ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన “నా దేశం – నా బాధ్యత” భావనతో ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని సూచించారు. గత 12 ఏళ్లుగా మోదీ నాయకత్వంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని గుర్తు చేశారు.

అమ్మ పేరిట మొక్కలు నాటాలి

ప్రతి ఇంట్లో జరిగే శుభకార్యాల సందర్భంగా తల్లి పేరు మీద ఒక మొక్క నాటే అలవాటు పెంపొందించాలని మంత్రి సూచించారు. తాను కూడా ఒక మొక్కను నాటి ఈ కార్యక్రమంలో భాగస్వామి కానున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా దశలవారీగా 15 వేల మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల నుంచి దీనికి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఇటీవల జరిగిన మహానాడులో 24 లక్షల మంది హైబ్రిడ్‌ విధానంలో పాల్గొనడం ఇంధన పొదుపు చర్యలకు ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలి

ప్లాస్టిక్‌ కాలుష్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రోజువారీ జీవితంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని కోరారు. “తగ్గించడం, తిరిగి వినియోగించడం, పునర్వినియోగం” అనే సూత్రాలను పాటిస్తూ ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాలోని 59 పాఠశాలలను పర్యావరణ హిత విద్యాసంస్థలుగా అభివృద్ధి చేసి విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జిల్లా పోలీసు అధికారి కె.వి. మహేశ్వర రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంతు కూర్మారావు, వివిధ శాఖల అధికారులు, కార్పొరేషన్‌ సిబ్బంది, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply