రైతు బజార్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

రైతు బజార్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
రైతులతో ముఖాముఖి… ధరలు, వసతులపై వివరాల సేకరణ..
స్వయంగా కూరగాయల కొనుగోలు చేసిన కలెక్టర్..
మార్కెట్‌లో అపరిశుభ్రతపై అసంతృప్తి..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మార్కెటింగ్ ఏడి, ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. బుధవారం టెక్కె మార్కెట్ యార్డ్‌లోని రైతు బజార్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మార్కెట్‌లోని వివిధ దుకాణాలను పరిశీలించి, అక్కడి శుభ్రత, నిర్వహణ తీరును సమీక్షించారు.

రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడుతూ కూరగాయల ధరలు, అమ్మకాల పరిస్థితి, వారికి అందుతున్న వసతులు, ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, వినియోగదారులతో కూడా మాట్లాడి ధరలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ప్రజల అవసరాలు, రైతుల ప్రయోజనాలను సమన్వయం చేసే విధంగా రైతు బజార్ నిర్వహణ ఉండాలని కలెక్టర్ సూచించారు. తన పర్యటనలో భాగంగా కలెక్టర్ స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి, ధరలు, నాణ్యతను పరిశీలించారు. మార్కెట్ యార్డ్‌లో కొన్ని ప్రాంతాల్లో కనిపించిన అపరిశుభ్రత, షాపుల నిర్వహణలో లోపాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారం రోజుల్లోగా మార్కెట్‌లోని అన్ని సమస్యలను పరిష్కరించి, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రైతు బజార్‌లో పారిశుధ్యం, తాగునీటి సదుపాయం, చెత్త నిర్వహణ, సరైన ధరల ప్రదర్శన వంటి అంశాల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు, వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో రైతు బజార్‌లను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, ప్రజలు కూడా శుభ్రత పాటించడంలో సహకరించాలని కలెక్టర్ కోరారు.
