నర్సింగ్ విద్యార్థికి వెలుగు సంస్థ ఆర్థిక సహాయం
కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి నెలా రూ.1000 అందజేత
గోదావరిఖని, ఆంధ్రప్రభ : వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సిరివేన అక్షయ అనే జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించారు.
ఈ మేరకు గురువారం సాయంత్రం వెలుగు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ చేతుల మీదుగా నగదును అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ మాట్లాడుతూ స్థానిక చంద్రశేఖర్ కిరాణా మర్చంట్ నిర్వాహకులు సీహెచ్ కిషోర్ తన తండ్రి సీహెచ్ చంద్రశేఖర్ జ్ఞాపకార్థం విద్యార్థినీ చదివించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు.
ప్రతి నెల రూ.1000 చొప్పున మూడు సంవత్సరాల నర్సింగ్ కోర్సు పూర్తయ్యే వరకు ఆర్థిక సహకారం అందజేయనున్నట్లు తెలిపారు.
విద్యార్థిని చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె చదువుకు చేయూత అందించేందుకు ఈ సహాయం చేపడుతున్నట్లు వివరించారు.
వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఆర్గనైజర్ గడవేన సదానందం తదితరులు పాల్గొన్నారు.
