రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్-వాష్ అండ్ గో’ తనిఖీలు

అర్ధరాత్రి నుంచి వాహనాల విస్తృత తనిఖీలు..

భద్రతా నిబంధనలు పాటించాలని పోలీసుల సూచన

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత లక్ష్యంగా పోలీసులు ప్రతిరోజూ ‘స్టాప్-వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు శనివారం అర్ధరాత్రి నుంచి ప్రధాన రహదారులపై విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్ బస్సులు, ముఖ్యంగా రాత్రి వేళల్లో సంచరించే వాహనాలను తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన భద్రతా చర్యలు, నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించారు.

జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారులైన కడప–నంద్యాల మార్గం, కర్నూలు–విజయవాడ హైవే, ఎన్‌హెచ్–44పై నంద్యాల నుంచి కర్నూలు, కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలతో పాటు ఇతర కీలక ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.

వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, బీమా, ఫిట్‌నెస్, ఇతర ధ్రువపత్రాలు, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు సక్రమంగా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. ప్రయాణ భద్రతకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు.

అతి వేగంగా వాహనాలు నడపడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.