ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
- డోర్ టు డోర్ కార్యక్రమంతో ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమం
- అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కొంతమూరు గ్రామం చెంచు కాలనీలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ యువ నాయకుడు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, పార్టీ నాయకులు, కమిటీ సభ్యులను డా. రవిరామ్ కిరణ్ అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాయకత్వంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు మించి సుమారు రూ.1,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమలవుతున్నాయని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పాలన సాగిస్తుండగా, మంత్రి నారా లోకేష్ విద్య, సమాచార సాంకేతికత, ఉపాధి రంగాల్లో రాష్ట్రానికి కొత్త అవకాశాలు తీసుకొస్తున్నారని కొనియాడారు.
ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్న డా. రవిరామ్ కిరణ్, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
డోర్ టు డోర్ ప్రచారంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలు, దీపం పథకం, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, అంగన్‌వాడీ సంక్షేమ చర్యలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం తదితర పథకాలపై ప్రజలకు వివరించాలని సూచించారు. త్వరలో ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
