కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు…

టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న
పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం
44వ డివిజన్‌లో ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వెల్లడి
పశ్చిమ నియోజకవర్గంలో 50 శాతం కార్యక్రమం పూర్తి చేశామని వెల్లడి
ప్రజల ఆదరణతో కూటమి ప్రభుత్వానికి దీర్ఘకాల పాలన ఖాయమని వ్యాఖ్య
అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ సీనియర్ నాయకుడికి ఆర్థిక సాయం అందజేత


(విజయవాడ, ఆంధ్రప్రభ): ప్రజలు కూటమి ప్రభుత్వానికి విశేష ఆదరణ చూపుతున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి శీను ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో బుద్దా వెంకన్న పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నామని తమకు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం ఇప్పటికే సుమారు 50 శాతం పూర్తయిందని తెలిపారు.

ప్రజల నుంచి వస్తున్న ఆదరణను బట్టి భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి ప్రభుత్వం విజయాన్ని సాధిస్తుందని ప్రజలే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతరం 44వ డివిజన్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మెరుగు మల్ల శీనుకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.3,000 ఆర్థిక సహాయాన్ని బుద్దా వెంకన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కే. సత్యనారాయణ సింగ్, 39, 44 డివిజన్ల క్లస్టర్ ఇన్‌చార్జి బడుగు గణేష్, సీనియర్ నాయకులు మైలవరపు దుర్గారావు, యూనిట్ ఇన్‌చార్జులు, బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.