బీమా ఏజెంట్లకు తోడుగా ‘బీమా సింగ్’ …
- కొత్త బ్రాండ్ మస్కట్‌ను ఆవిష్కరించిన పీబీ పార్ట్‌నర్స్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పాలసీబజార్‌కు చెందిన పీబీ పార్ట్‌నర్స్ (PB Partners) తన బీమా సలహాదారుల నెట్‌వర్క్‌కు మరింత మద్దతు అందించే లక్ష్యంతో ‘బీమా సింగ్’ పేరుతో అధికారిక బ్రాండ్ మస్కట్‌ను ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏజెంట్ భాగస్వాములకు బీమా సమాచారాన్ని మరింత సులభంగా, ఆకర్షణీయంగా, ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సంస్థ తెలిపింది.
బీమా సింగ్ పీబీ పార్ట్‌నర్స్ ప్రధాన విలువలైన విశ్వాసం, మార్గదర్శకత్వం, భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని సంస్థ వెల్లడించింది. బీమా భావనలను సులభంగా అర్థమయ్యేలా వివరించడం, ఏజెంట్లతో మరింత మెరుగైన అనుసంధానం పెంచడం, శిక్షణా కార్యక్రమాలను ఆసక్తికరంగా మార్చడంలో ఈ మస్కట్ కీలక పాత్ర పోషించనుంది.
ప్రస్తుతం పీబీ పార్ట్‌నర్స్ దేశంలోని 703 నగరాలు, 19 వేలకుపైగా పిన్‌కోడ్‌ల పరిధిలో 5 లక్షలకు పైగా బీమా సలహాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉందని సంస్థ తెలిపింది. ఈ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు ఏజెంట్లకు సాంకేతికత, శిక్షణ, వ్యాపార అవకాశాల్లో నిరంతర సహకారం అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని పేర్కొంది.
బీమా సింగ్ ద్వారా విద్యాపరమైన కంటెంట్, అవగాహన కార్యక్రమాలు, శిక్షణా మాడ్యూల్స్, డిజిటల్ ప్రచారాలు, రోజువారీ సలహాదారుల సంభాషణలను మరింత సులభతరం చేయాలని పీబీ పార్ట్‌నర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించడం ద్వారా దేశవ్యాప్తంగా బీమా సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది.
