దేశానికి వెన్నెముక రైతన్న..

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులతో కలిసి వ్యవసాయ పనులకు శ్రీకారం.. చొదిమెళ్ళలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చంటి పాల్గొన్నారు

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : దేశానికి వెన్నెముక రైతన్న అని, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు రూరల్ మండలం చొదిమెళ్ళ గ్రామంలో సోమవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)తో కలిసి ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రైతులతో కలిసి సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. ఏరువాక పౌర్ణమి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రైతన్నల పండుగ అని పేర్కొన్నారు. పంటల సాగుకు శ్రీకారం చుట్టే ఈ పర్వదినం రైతుల జీవితంలో ఎంతో విశిష్టమైనదని అన్నారు. వ్యవసాయం దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక అని, రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సాంప్రదాయ వ్యవసాయ విలువలను కూడా కొనసాగించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులతో మమేకమై వారి సమస్యలు, సాగు పరిస్థితులపై ఆరా తీశారు.

భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ 31 వేల భూసార పరీక్షల కార్డులను రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. గత రెండేళ్లలో రూ.681 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి, ధాన్యం అప్పగించిన కొద్ది గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వెల్లడించారు.

అన్నదాత సుఖీభవ పథకం, సాగులో యాంత్రీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, డ్రోన్లు వంటి ఆధునిక పరికరాలను సబ్సిడీపై అందిస్తోందన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచించిన వరి వంగడాలను సాగు చేయాలని రైతులకు సూచించారు. రైతులు, కౌలు రైతులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వ్యవసాయ అధికారులను లేదా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ.. ఏరువాక పౌర్ణమి తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎంతో వైభవంగా జరుపుకునే తొలి వ్యవసాయ పండుగ అని అన్నారు. తొలకరి వర్షాల అనంతరం భూమిని దున్నేందుకు సిద్ధం చేయడాన్నే ‘ఏరువాక’గా పేర్కొంటారని వివరించారు. ఈ రోజున నాగలి, వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి సాగు పనులను ప్రారంభించడం ఆనవాయితీ అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని, విత్తనం వేసిన దశ నుంచి పంటకు గిట్టుబాటు ధర లభించే వరకు ప్రతి రైతుకు అండగా నిలుస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. పంట రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, ఉచిత పంట బీమా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలతో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం. పార్థసారధి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్.కె. హబీబ్ భాషా, వ్యవసాయ శాఖ అధికారులు అనిల్ కుమార్, సంతోష్, తహసీల్దార్ గాయత్రి, వివిధ శాఖల అధికారులు, రైతులు, కౌలు రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.