Epic | డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న దేవరకొండ..

Epic | డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న దేవరకొండ..

Epic, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రానికి ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ అనే డిఫరెంట్ టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ’90s’ వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.

హైదరాబాద్ లోని ఆర్కే సినీప్లెక్స్ లో ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ‘ఎపిక్’ గ్లింప్స్ చిత్ర టైటిల్ కి తగ్గట్టుగానే అద్భుతంగా ఉంది. లండన్‌లో జరుగుతున్న విద్యార్థుల స్నాతకోత్సవం నేపథ్యంలో గ్లింప్స్ ప్రారంభమైంది. ఇందులో వైష్ణవి చైతన్య, తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో మాట్లాడుతుంది. ఈ క్రమంలో ప్రజాకవి, గాయకుడు గద్దర్ ను గుర్తు చేసే అవతారంలో కనిపించి ఆశ్చర్యపరుస్తారు ఆనంద్ దేవరకొండ. “శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ” అనే సంభాషణ ఈ చిత్రం ఎంత వైవిధ్యంగా, ఎంత వినోదభరితంగా ఉండబోతుందో తెలిపింది. ’90s’ వెబ్ సిరీస్ లో రోహన్ పోషించిన ఆదిత్య పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర ప్రయాణాన్ని కొనసాగిస్తూ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం విశేషం.

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ వేడుకలో కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం రావడానికి ముందే.. నేను ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన 90s వెబ్ సిరీస్ చూశాను. సిరీస్ నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఆదిత్య పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. గ్లింప్స్ లో ఆదిత్య ఎలాగైతే అమ్మాయితో మాట్లాడాడో, నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు అలాగే తడబడుతూ మాట్లాడేవాడిని. అలాంటి ఆదిత్య పెద్దయ్యాక తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల లండన్ కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది? ప్రేమ కథ ఏంటి? వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో ప్రతి అంశం, ప్రతి సన్నివేశం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. తెలుగులో పూర్తి స్థాయిలో రొమాంటిక్ కామెడీ సినిమాలు పెద్దగా రావడం లేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఎపిక్ సినిమా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు. ఆదిత్య హాసన్ రాసిన ఇంత మంచి కథలో భాగం కావడం సంతోషంగా ఉంది. వైష్ణవి అద్భుతంగా నటించింది. లండన్ లో జరిగే కథ అయినా.. ఇది మన ఇంట్లో జరిగే కథలా ఉంటుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. “ఎపిక్ టైటిల్ గ్లింప్స్‌ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఇది యువతకు నచ్చే అందమైన ప్రేమ కథ. హీరో పాత్రకు చాలా మంది అబ్బాయిలు కనెక్ట్ అవుతారు. హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదిత్య హాసన్ గారు మనలాంటోడు, మనలో ఒకడిగా కనిపిస్తారు. అందుకే ఆయన కథలు అందరికీ కనెక్ట్ అవుతాయి. జీవితంలో మనం దాటి వచ్చిన చిన్న చిన్న అందమైన జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది” అన్నారు.

Leave a Reply