ప్రజల పక్షాన నిలిచేది జనసేనే: అమ్మిశెట్టి వాసు

ప్రజల పక్షాన నిలిచేది జనసేనే: అమ్మిశెట్టి వాసు
పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ – అనుచిత వ్యాఖ్యలు దారుణమని విమర్శ
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలిచే పార్టీగా కొనసాగుతోందని, సమస్యల పరిష్కారానికి ఎలాంటి రాజీ పడదని జనసేన రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.
విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అమ్మిశెట్టి వాసు, పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని తీవ్రంగా విమర్శించారు.
మచిలీపట్నం ఘటనను ప్రస్తావిస్తూ గతంలో తమ పార్టీ అక్కడ లేకపోయిందని, ప్రస్తుతం అక్కడ జనసేన ఎంపీ ఉన్నారని తెలిపారు. స్థానిక సమస్యలపై ఎంపీ బాలశౌరి స్వయంగా స్పందించి మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన విషయాన్ని గుర్తుచేశారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల కూల్చివేతలు, జనసైనికులు, వీర మహిళలపై అక్రమ కేసులు, దాడులు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చినా అభివృద్ధి కాకుండా బూతులతో పాలన సాగించారని విమర్శించారు.
సినిమా రంగ ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అవమానించిన సందర్భాల్లో పేర్ని నాని స్పందించలేదని ప్రశ్నించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో గత ముప్పై ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని, ఐదేళ్ల మంత్రి కాలంలోనూ పరిస్థితి మారలేదని అన్నారు.
కూటమి ప్రభుత్వంలో జనసేన ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, పార్టీ కార్యాలయంలో రోజూ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పనిచేస్తామని స్పష్టం చేసిన వాసు, పేర్ని నాని ఇకనైనా బాధ్యతగా మాట్లాడాలని హెచ్చరించారు.
