Election | ఈ రోజు.. ఆంధ్రప్రభలో.. ప్రత్యేక కథనం..

Election | ఈ రోజు.. ఆంధ్రప్రభలో.. ప్రత్యేక కథనం..

Election | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరిం చుకున్నాయి. గత దశాబ్దంలో ఈ రాష్ట్రం రాజకీయంగా విపరీత మార్పులను చూసింది. వామపక్షాల దీర్ఘకాల పాలన అనంతరం తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టడం, ఆ పై భారతీయ జనతా పార్టీ వేగంగా ఎదగడం ఈ పరిణామాలు బెంగాలు జాతీయ రాజకీయాల్లో కీలక కేంద్రంగా మార్చాయి. ఈ నేపథ్యంలో 2026 ఎన్నికలు కేవలం అధికార పోరు మాత్రమే కాకుండా, పాలనా నమూనాలు, సామాజిక సమీకరణాలు, ఓటర్ల భావోద్వేగాల మధ్య జరిగే పోరాటంగా మారాయి.

ఈ ఎన్నికలలో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్యనే కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుత సర్వేలు టీఎంసీకి కొంత ఆధిక్యాన్ని సూచిస్తున్నప్పటికీ, బీజేపీ బలమైన ప్రత్యర్థిగా నిలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పోటీ మరింత సమీకతంగా, తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో అత్యంత కీలకంగా మారిన అంశం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ప్రక్రియలో లక్షల సంఖ్యలో ఓటర్లు తొలగించబడటం, మరికొంతమంది పరిశీలనలో ఉండటం రాజకీయ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మొత్తం ఓటర్ల సంఖ్యలో గణనీయ మైన మార్పురావడం, దాదాపు ఒక కోటి మందికి పైగా ఓటర్ల స్థితి అనిశ్చితంగా మారడం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశంగా మారింది.

అధికార టీఎంసీ ఈ ప్రక్రియను రాజకీయంగా ప్రేరేపిత చర్యగా విమర్శిస్తుండగా, బీజేపీ మాత్రం అక్రమ ఓటర్లను తొలగించేందుకు అవసరమైన చర్యగా దీనిని సమర్థిస్తోంది. ఈ అంశం వందకు పైగా నియోజకవర్గాలలో ఎన్నికల సమీకరణాలను మార్చే సామర్థ్యం కలిగి ఉంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ఆధారంగా బలమైన ఓటు బ్యాంక్ను ఏర్పరచుకుంది. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ వర్గాలు, అణగారిన వర్గాలలో ఈ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్మీర్ భండార్, కన్యాశ్రీ, రూపశ్రీ, స్వాస్థ్య సాధీ వంటి పథకాలు ప్రజల ప్రజల జీవన సరళిని మార్చాయి, ఇవి రాజకీయ మద్దతుగా మారాయి. మహిళలలో టీఎంసీకి ఉన్న మద్దతు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. కుటుంబాల్లో ఆర్థిక నిర్ణయాల్లో మహిళల పాత్ర పెరగడం, ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యక్ష ప్రయోజనాలు మహిళా ఓటర్లను ప్రభావితం చేసే ఆంశాలు.

అయితే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెరుగుతున్న అసంతృప్తి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు, ఉద్యోగ నియామకాలలో వివాదాలు, పెట్టుబడుల లోపం, పరిశ్రమల తరలింపు వంటి అంశాలు టీఎంసీ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. యువతలో నిరుద్యోగ సమస్య తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తోంది. పట్టణ ప్రాంతాలలో ఈ వ్యతిరేకత మరింతగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2024లో జరిగిన ఘటన అనంతరం చెలరేగిన నిరసనలు, మహిళా భద్రత పై ప్రశ్నలు, ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాస సంక్షోభం వంటి అంశాలు పట్టణ ఓటర్లలో ప్రతికూల భావనను పెంచాయి.

ఇదే సమయంలో బీజేపీ తన వ్యూహాన్ని స్పష్టంగా రూపొం దించుకుంది. హిందూ ఓటు బ్యాంకు సమీకరించడం, మతువావంటి కీలక సామాజిక వర్గాలను ఆకర్షించడం, యువతలో మద్దతు పెంపు – ఇవి బీజేపీ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. మతువా వర్గం సుమారు 50 నియోజకవర్గాలలో ప్రభావం చూపగలదని అంచనా. యువ ఓటర్లలో బీజేపీకి ఉన్న ఆకర్షణ ఈ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 18-24 వయస్సు గల ఓటర్లలో ప్రతిపక్షానికి ఉన్న మద్దతు టీఎంసీకి సవాలుగా మారుతోంది. టీఎంసీ మరోవైపు “బెంగాలీ అస్మిత” అనే భావనను ముందుకు తెస్తోంది. బీజేపీని “బాహ్యశక్తి “గా చూపిస్తూ, స్థానికత అంశాన్ని తెరపైకి తెచ్చి తద్వారా ఓటర్లను ప్రోత్సహించడం, ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోంది. వల సదారుల అంశం, బెంగాల్ సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలు ఈ ప్రచారంలో ప్రధానంగా నిలుస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ వ్యూహం ఫలించినందున, ఈసారి కూడా అదే విధానాన్ని టీఎంసీ కొనసాగిస్తోంది.

ఓటర్ల ధోరణులు కూడా ఆసక్తికరంగా మారాయి. మహిళలు, ముస్లిం ఓటర్లు టీఎంసీవైపు మొగ్గు చూపుతుండగా, యువత మరియు కొన్ని హిందూ వర్గాలు బీజేపీ వైపు సాగుతున్నాయి. వయస్సు ఆధారంగా కూడా ఓటింగ్ ధోరణుల్లో మార్పు లు కనిపిస్తున్నాయి. పెద్దవారిలో టీఎంసీకి మద్దతు ఎక్కువగా ఉండగా, యువతలో బీజేపీకి మద్దతు పెరుగుతోంది. ఇది ఎన్నికలను మరింత పోటీగా మార్చుతోంది. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీ లు ప్రస్తుతం పరిమిత ప్రభావంతో ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. చిన్న పార్టీలు, ప్రాంతీయ శక్తులు కూడా ఎన్నికల తరువాత కీలకంగా మారవచ్చు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఇవే పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించే స్థితిలో ఉండవచ్చు.

మొత్తం మీద పశ్చిమ బెంగాల్ 2026 ఎన్నికలు అనేక విభిన్న అంశాల సమ్మేళనంగా మారాయి. సంక్షేమ పథకాల ప్రభావం, ప్రభుత్వ వ్యతిరేకత, యువత అసంతృప్తి, మత, జాతి సమీకర ణాలు, మరియు ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వంటి అంశాలు కలిసి ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం టీఎంసీకి కొంత ఆధిక్యం ఉన్నప్పటికీ, బీజేపీ బలమైన పోటీ ఇస్తోంది. మహిళలు మరియు గ్రామీణ వర్గాలు టీఎంసీకి బలంగా నిలిస్తే, యువత మరియు పట్టణ వర్గాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతు న్నాయి. ఈ ఎన్నికలు కేవలం అధికార మార్పు గురించినవి మాత్రమే కావు. ఇవి సంక్షేమం మరియు అభివృద్ధి మధ్య, స్థానికత మరియు జాతీయత మధ్య, స్థిరత్వం మరియు మార్పు మధ్య జరుగుతున్న పోరాటం. అందువల్ల పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయ దిశను నిర్ణయించే కీలక మలుపుగా నిలవనున్నాయి.

  • వాడవల్లి శ్రీధర్

Leave a Reply