మూడు ఏజెన్సీ మండలాల అభివృద్ధి పనులపై సీతక్క సమీక్ష

  • పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం ఏజెన్సీ మండలాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. ప్రజలకు ఉపయోగపడే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

అభివృద్ధి పనుల అమలులో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సమావేశంలో అటవీశాఖ అధికారి వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జీ, ఎం. సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.