ప్రమాదవశాత్తు బావిలో పడిన జింక..

  • సురక్షితంగా రక్షించిన అటవీ శాఖ అధికారులు

మర్పల్లి, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని బూచన్‌పల్లి గ్రామంలో వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు ఒక జింక పడింది. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

రోజూ మాదిరిగానే పొలానికి వచ్చిన రైతు బావిలో చూడగా జింక కనిపించింది. వెంటనే ఆయన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

రైతు సమాచారం మేరకు తాండూర్ ఎఫ్‌ఆర్‌ఓ శ్రీదేవి సరస్వతి, బంటారం ఎఫ్‌ఎస్‌ఓ కిషన్, ఎఫ్‌బీఓ వెంకటేశం సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. బావి లోతుగా ఉండటంతో స్థానికుల సహాయంతో జింకను సురక్షితంగా బయటికి తీశారు.

జింకకు స్వల్ప గాయాలే ఉన్నట్లు గుర్తించిన అధికారులు, ప్రాథమికంగా పరిశీలించి అనంతరం సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు ఎఫ్‌ఆర్‌ఓ శ్రీదేవి సరస్వతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎక్కడైనా వన్యప్రాణులు ప్రమాదంలో కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.