చదువుతో పాటు సామాజిక అవగాహన పెంచుకోవాలి..

  • కేజీబీవీ విద్యార్థినులకు అవగాహన సదస్సు..
  • సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రతపై సూచనలు
  • డీఎస్పీ మధుసూదన్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : విద్యార్థినులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని, వ్యక్తిగత భద్రతతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి సూచించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

విద్యార్థినుల వ్యక్తిగత భద్రత, క్రమశిక్షణ, సోషల్ మీడియా బాధ్యతాయుత వినియోగం, సైబర్ మోసాల నివారణ, విద్య ప్రాధాన్యత వంటి అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.

బాల్య వివాహాలు, బాలలపై జరిగే వేధింపులను అరికట్టడంలో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఘటనలు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్, కార్లలో సీట్ బెల్ట్ ధరించడం, రోడ్డు దాటేటప్పుడు భద్రతా నియమాలు పాటించడం వంటి అంశాలను వివరించారు.

ప్రతి విద్యార్థిని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మథకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.