కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వొద్దు..
- హైకోర్టును ఆశ్రయించిన అంతమ్మగూడెం రైతులు
- సింబయోటిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ పనులను నిలిపివేయాలని రిట్ పిటిషన్
- ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న గ్రామ ప్రజలు
- ఆగస్టు 27న తదుపరి విచారణకు హైకోర్టు నిర్ణయం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సింబయోటిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పనులను తక్షణమే నిలిపివేయాలని, అలాగే ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వరాదని కోరుతూ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గ్రామ రైతులు గుమ్మి నరేందర్ రెడ్డి తదితరులు ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కాలుష్య కోరల్లో గ్రామం:
గ్రామ సమీపంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హజలో లాబరేటరీ వంటి పరిశ్రమల వల్ల తీవ్ర వాయు, జల కాలుష్యం ఏర్పడిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రసాయన వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయ భూములు సాగుకు పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత వాతావరణం వల్ల గ్రామ ప్రజలు శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, జన్యు లోపాలు వంటి భయంకరమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని వివరించారు. ఈ కాలుష్య సమస్యలపై రైతు ప్రతినిధులు గుమ్మి నరేందర్ రెడ్డి, గుమ్మి దామోదర్ రెడ్డి తదితరులు గతంలోనే దాఖలు చేసిన పలు పిటిషన్లతో పాటు ఈ కొత్త పిటిషన్ లను కూడా ఈ ఏడాది ఆగస్టు 27న విచారిస్తామని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే కోర్టుకు:
గ్రామంలో పొంచి ఉన్న కాలుష్య ముప్పుపై గత మార్చి నెలలోనే జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినప్పటికీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం ఆసరాగా చేసుకుని సింబయోటిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ నిర్మాణ పనులు ప్రారంభించడంతోనే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే పర్యావరణ భారాన్ని మోస్తున్న అంతమ్మగూడెంలో మరిన్ని పరిశ్రమలు వస్తే మనుగడ కష్టమని, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త పరిశ్రమల నిర్మాణాలను అడ్డుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
