వేసవిలో చిన్నారుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం

వేసవిలో చిన్నారుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం

ఖమ్మం, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: వేసవి కాలంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్‌ నుంచి హీట్‌స్ట్రోక్‌ వరకు పలు ఆరోగ్య సమస్యలు పిల్లలకు ముప్పుగా మారుతున్నాయని డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌ తెలిపారు.

వేసవిలో పిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య డీహైడ్రేషన్‌ అని ఆయన పేర్కొన్నారు. ఆడుకునే సమయంలో నీరు తాగడం మరిచిపోవడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుందని చెప్పారు. తీవ్రమైన దాహం, అలసట, తక్కువ మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాధారణ నీటితో పాటు ఓఆర్‌ఎస్‌ ద్రావణం, కొబ్బరి నీళ్లు ఇవ్వడం మంచిదని తెలిపారు.

ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో పిల్లలు ఎక్కువసేపు బయట ఉండటం వల్ల హీట్‌స్ట్రోక్‌ ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక జ్వరం, మైకం, ఆయాసం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. మధ్యాహ్న వేళల్లో పిల్లలను బయట ఆడకుండా చూసుకోవాలని, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే అనుమతించడం మంచిదని చెప్పారు.

వేసవిలో అధిక చెమట కారణంగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ముఖ్యంగా గజ్జ, చేతుల కింద భాగాలు, కాళ్ల వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. చెమటతో తడిసిన దుస్తులను వెంటనే మార్చడం, శుభ్రత పాటించడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చని సూచించారు.

చిన్నారుల్లో సాధారణంగా కనిపించే మరో సమస్య ప్రిక్లీ హీట్‌ అని వైద్యులు పేర్కొన్నారు. చెమట గ్రంథులు మూసుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని, కాటన్‌ దుస్తులు ధరింపజేయడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం ఉపశమనాన్ని ఇస్తుందని తెలిపారు.

వేసవిలో కలుషిత ఆహారం, నీటి కారణంగా అతిసారం కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరించారు. బయట ఆహారం ఇవ్వకుండా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలని, మరిగించిన లేదా సురక్షిత నీటిని మాత్రమే తాగించాలన్నారు.

తల్లిదండ్రులు చిన్నారుల ఆహారం, పరిశుభ్రత, నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌ సూచించారు.

Leave a Reply