అత్యవసర సేవలకు జిల్లా డీఆర్ఎఫ్ బృందం సిద్ధం: ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల (ఆంధ్రప్రభ): వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. బుధవారం వేములవాడ పట్టణ పరిధిలోని నాంపెళ్లి గ్రామ చెరువులో నిర్వహించిన డీఆర్ఎఫ్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని సహాయక చర్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఆర్ఎఫ్ సభ్యులతో కలిసి రెస్క్యూ బోటులో ప్రయాణించిన ఎస్పీ, అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలను రక్షించేలా ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఆర్ఐ ఆధ్వర్యంలో 12 మంది సభ్యులతో కూడిన డీఆర్ఎఫ్ బృందం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు.
వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. జిల్లా డీఆర్ఎఫ్ బృందం వద్ద రెస్క్యూ బోటు, మోటార్, మెడికల్ స్ట్రెచర్, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్ యంత్రాలు తదితర ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉన్నట్లు గమనించినా లేదా సహాయం అవసరమైనా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గత ఏడాది వరదలు, గణేష్ నిమజ్జనాల సందర్భంగా డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సేవలను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్, ఆర్‌ఎస్‌ఐ అడ్మిన్ సురేష్, ఆర్‌ఎస్‌ఐలు సాయి కిరణ్, శ్రావణ్ యాదవ్, డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
