దర్యాప్తుపై సీపీ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు

దర్యాప్తుపై సీపీ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, ఆంధ్రప్రభ: కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న కేసుల దర్యాప్తులో ఎలాంటి రాజీ పడకుండా పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఇప్పటివరకు నమోదైన కేసులు, పెండింగ్‌లో ఉన్న పాత కేసులపై సీపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని, తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
కమిషనరేట్ పరిధిలో నమోదయ్యే ప్రతి కేసు దర్యాప్తులో చట్టబద్ధత, పారదర్శకత ఉండాలని సీపీ స్పష్టం చేశారు. 2025కి ముందు నమోదై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ, అరెస్టులు, సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.
ప్రాపర్టీ, బాడిలీ అఫెన్స్ కేసుల దర్యాప్తును పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. గ్రేవ్ కేసుల పురోగతిని డీసీపీలు, అదనపు డీసీపీలు వారానికి ఒకసారి సమీక్షించాలని ఆదేశించారు. ఆర్థిక నేరాల కేసుల్లో చట్ట ప్రకారం నిందితులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు.
కిడ్నాపింగ్, మిస్సింగ్ కేసుల్లో బాధితులను గుర్తించడంలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. ఇలాంటి కేసుల్లో ఆలస్యం ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను గౌరవ న్యాయస్థానం అనుమతితో త్వరితగతిన నిర్వీర్యం చేయాలని సూచించారు.
సైబర్ క్రైమ్, ఎన్డీపీఎస్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థులు ఉన్నట్లయితే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, కన్విక్షన్ శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.
ఎన్ఫోర్స్‌మెంట్ కార్యకలాపాల్లో భాగంగా అక్రమ ఇసుక రవాణా, గుడుంబా తయారీ, పేకాట తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని సీపీ అన్నారు. ప్రజల నుంచి నేరుగా అందే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. సీపీ కార్యాలయం ద్వారా వచ్చే ఫిర్యాదులపై కూడా వేగంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
