తిరుపతిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం..

తిరుపతిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం..

  • డెంగ్యూ నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలని డీఎంహెచ్‌వో పిలుపు
  • “ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి” అంటూ ప్రజలకు సూచనలు
  • విద్యార్థుల మానవహారం

తిరుపతి హెల్త్, ఆంధ్రప్రభ : నగరంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ అధ్యక్షతన, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ జి.కె. రూప్ కుమార్ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది.

ర్యాలీని డీఎంహెచ్‌వో డాక్టర్ బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. డెంగ్యూ వ్యతిరేక నినాదాలతో సాగిన ర్యాలీలో అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వద్ద శ్రీ పద్మావతమ్మ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థినులు మానవహారం నిర్మించి డెంగ్యూ నిర్మూలనపై నినాదాలు చేశారు.

అనంతరం విద్యార్థులు, సిబ్బంది, జిల్లా అధికారులతో కలిసి డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ఈడిస్ ఈజిప్టై అనే దోమ కాటు వల్ల వస్తుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుందని చెప్పారు. ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించి ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. వాడి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు, కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ వస్తువులు ఇంటి చుట్టుపక్కల ఉండకుండా జాగ్రత్త పడాలని తెలిపారు.

దోమలు కుట్టకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవడం, దోమల బ్యాట్లు, రిపెలెంట్లు వినియోగించడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా డెంగ్యూ నివారణ సాధ్యమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, డీపీఎంఓ డాక్టర్ చత్ర ప్రకాష్ రెడ్డి, ఎన్‌సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డి ప్రసాద్, స్టాటిస్టికల్ ఆఫీసర్ నాగేంద్ర కుమార్, డిప్యూటీ డెమో బలరామరాజు, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు, మలేరియా సబ్ యూనిట్ అధికారులు, ఎంపీహెచ్ఈఓలు, పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.