ప్లాస్టిక్ రహిత తిరుపతి లక్ష్యం ..

ప్లాస్టిక్ రహిత తిరుపతి లక్ష్యం ..

  • స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా అవగాహన ర్యాలీ
  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని పిలుపు
  • గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగుల వినియోగంపై అవగాహన

తిరుపతి కార్పొరేషన్, ఆంధ్రప్రభ : తిరుపతిని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇంచార్జి కమిషనర్ శారదా దేవి పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పాత మునిసిపల్ కార్యాలయం నుండి ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఇంచార్జి కమిషనర్ శారదా దేవి, గ్రీనరి అండ్ బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం తదితరులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారం ప్రత్యేక థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి “ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్” అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగులు వంటి పర్యావరణహిత వస్తువులను వినియోగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, డీఈలు రాజు, వెంకట ప్రసాద్, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.