చిన్నారుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి….

మరిపెడ, ఆంధ్రప్రభ: చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి పౌష్టికాహారం కీలకమని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. సోమవారం మండలంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీ ఆడిటోరియంలో నిర్వహించిన అంగన్వాడి వంట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు అందిస్తున్న పోషకాహార భోజనాల తయారీ విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ఆహారం అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు.

అంగన్వాడి సిబ్బందితో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మరిపెడ మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడి టీచర్లు, సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply