డీఈఓ, ఎఫ్‌ఏఓపై ఆరోపణలు.. ఆర్డీఓ ఎదుట వివరణ

  • ఫిర్యాదుదారుడు, అధికారులు హాజరు…
  • కలెక్టర్‌కు త్వరలో నివేదిక సమర్పిస్తామని ఆర్డీఓ వెల్లడి..

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంగళవారం భూపాలపల్లి ఆర్డీఓ కార్యాలయంలో విచారణ నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ విచారణకు ఫిర్యాదుదారుడితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అధికారి (ఎఫ్‌ఏఓ), సంబంధిత అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేక అధికారి హాజరై తమ వివరణలను ఆర్డీఓకు సమర్పించారు.

భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన కుసుమ రామకృష్ణ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, దానిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆర్డీఓను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు.

విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడు తన ఆరోపణలకు సంబంధించిన వివరాలను ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లగా, సంబంధిత అధికారులు వాటిపై తమ వివరణలు, ఆధార పత్రాలను సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన పత్రాలను ఆర్డీఓ క్షుణ్ణంగా నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఫిర్యాదు, సంబంధిత అధికారుల వివరణలు, సమర్పించిన ఆధారాలను సమగ్రంగా పరిశీలించి పూర్తి నివేదికను సిద్ధం చేసి త్వరలోనే జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. కలెక్టర్ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

జిల్లా విద్యాశాఖలో నిధుల వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. కలెక్టర్‌కు సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.