కానరాని వైద్యులు.. కష్టాల్లో రోగులు
రోగులకు తప్పని నిరీక్షణ
డాక్టర్లు, ఫార్మసిస్టు కొరత
బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల అవస్థలు
దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చే ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కొరతతో విలవిల్లాడుతోంది. వైద్యులు సమయానికి అందుబాటులో లేకపోవడం, ఫార్మసిస్టు పోస్టు ఖాళీగా ఉండడంతో చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలుతున్న వేళ వైద్య సేవలు సక్రమంగా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బాసర (ఆంధ్రప్రభ): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అస్తవ్యస్తంగా మారాయి. వైద్యాధికారులు సమయపాలన పాటించకపోవడంతో ఉదయం 11 గంటలు దాటినా వైద్యులు అందుబాటులో లేక రోగులు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో చికిత్స కోసం వచ్చిన వారు ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

సుమారు 15 వేల జనాభాతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క మెడికల్ ఆఫీసర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆ ఒక్క వైద్యుడు కూడా సమయానికి ఆసుపత్రికి రాకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఫార్మసిస్టు లేక మందుల పంపిణీకి అంతరాయం
వర్షాకాలంలో జ్వరాలు, వైరల్ వ్యాధులు, ఇతర అంటువ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. అయితే ఇక్కడ పనిచేస్తున్న ఫార్మసిస్టును బిల్వార్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో కొత్త ఫార్మసిస్టును నియమించలేదు. దీంతో వైద్య పరీక్షల అనంతరం రోగులకు మందులు అందించే వ్యవస్థ కూడా ఇబ్బందులకు గురవుతోంది.

వైద్య సేవలను బలోపేతం చేయాలని ప్రజల విజ్ఞప్తి
ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన బాసరలో అన్ని సమయాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా తగిన సంఖ్యలో వైద్యులు, ఫార్మసిస్టు సహా అవసరమైన సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు. 24 గంటల వైద్య సేవలు అందేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
