రూ.46 వేల విలువైన అక్రమ టేకు కలప స్వాధీనం

  • ఇంటికి తాళం వేసి నిందితుడు పరారీ
  • పోలీసుల సమక్షంలో తాళం పగులగొట్టి తనిఖీ
  • మోటార్, కలప కోసే యంత్రం స్వాధీనం

జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.46 వేల విలువైన టేకు దుంగలు, చెక్కలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జన్నారం ఫారెస్ట్ రేంజ్ అధికారి జి. వికాస్ బుధవారం వెల్లడించారు.

స్థానిక ఎఫ్‌డీఓ ఎం. రామ్మోహన్ ఆదేశాల మేరకు జన్నారం, ఇందన్‌పల్లి ఫారెస్ట్ సెక్షన్, బీట్ అధికారులు, జన్నారం ఎస్‌ఐ గుర్రం ఉదయ్ కిరణ్ సమక్షంలో లాకావత్ ఈర్యానాయక్ ఇంటిపై దాడి నిర్వహించారు. అయితే అధికారులు చేరుకునేలోపే నిందితుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.

దీంతో పోలీసుల సమక్షంలో ఇంటి తాళం పగులగొట్టి తనిఖీ నిర్వహించగా, ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలు, చెక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే విద్యుత్ మోటార్, కలప కోసే యంత్రాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు.

నిందితుడిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న టేకు కలపను జన్నారం కలప డిపోకు తరలించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి వెల్లడించారు.