మొగల్తూరు హై స్కూల్ గ్రౌండ్ లో అమరావతి గేమ్స్..
ఈ నెల 30, 31తేదీలలో ఆటల పోటీలు
నరసాపురం, ఆంధ్రప్రభ : నరసాపురం నియోజకవర్గ స్థాయి అమరావతి గేమ్స్‌ను ఈ నెల 30, 31 తేదీల్లో మొగల్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు నరసాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మొగల్తూరు, నరసాపురం మండలాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు, ఇరు మండలాల విద్యాశాఖ అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారి, మండల అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమరావతి గేమ్స్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ, ఇతర అంశాలపై సమీక్షించారు.

ఈ పోటీల్లో అండర్-17, అండర్-23 వయో విభాగాలకు చెందిన క్రీడాకారులకు అథ్లెటిక్స్, ఆర్చరీ, ఖో-ఖో, చెస్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, యోగా, హాకీ తదితర 12 క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి అధికారి మాట్లాడుతూ, క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థి క్రీడలను జీవితంలో భాగంగా చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేలా కృషి చేయాలని సూచించారు.
అమరావతి గేమ్స్‌లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు అమరావతి గేమ్స్ యాప్ ద్వారా తప్పనిసరిగా ముందస్తుగా తన పేరును నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. క్రీడలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ శేఖర్ (పీడీ)ను 9299555535 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
