సమస్య చెప్పడానికి వెళ్తే చీదరింపులా?..
సమస్య చెప్పడానికి వెళ్తే చీదరింపులా?..
చింతలపూడి రెవెన్యూ కార్యాలయంపై బాధితుల ఆవేదన!
పీజీఆర్‌ఎస్ అర్జీలతో తిరుగుతున్న మహిళలకు నిరాశ..

జిల్లా అధికారుల ఆదేశాలు అమలు కావడం లేదని ఆరోపణలు
చింతలపూడి, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించాల్సిన రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి మండల రెవెన్యూ కార్యాలయంలో తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు సరైన స్పందన ఇవ్వకుండా చీదరింపులకు గురిచేస్తున్నారని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు ఆ లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గ్రామ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాక జిల్లా అధికారులను ఆశ్రయిస్తే, వారు మళ్లీ మండల అధికారుల వద్దకే పంపుతున్నారని చెబుతున్నారు. అయితే జిల్లా అధికారుల సూచనలతో తిరిగి మండల కార్యాలయాలకు వెళ్లినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోగా అవమానాలు ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు.

చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన ఎం. వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, ప్రభుత్వం తనకు మంజూరు చేసిన ఇంటి స్థలంలో ఇతరులు ఆక్రమణకు పాల్పడుతున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని తెలిపారు. జిల్లా అధికారులు తహసీల్దార్ కార్యాలయానికి పంపించినప్పటికీ నెలల తరబడి తిరుగుతున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, కలెక్టర్, సబ్ కలెక్టర్‌ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు.
తీగలవంచ గ్రామానికి చెందిన ఎం. సంతోషం మాట్లాడుతూ, తన తండ్రి నుంచి వచ్చిన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. న్యాయం కోసం జిల్లా అధికారులను ఆశ్రయించగా రెవెన్యూ అధికారుల వద్దకు పంపించారని, ప్రతిరోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోయారు. తహసీల్దార్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం దొరకడం లేదని తెలిపారు.
ఈ వ్యవహారంపై సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.వి. సత్యనారాయణ స్పందిస్తూ, ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని, వారి సమస్యలను పూర్తిగా విని చట్టపరంగా విచారణ జరిపి సమాధానం చెప్పడం అధికారుల బాధ్యత అని అన్నారు. ప్రజలపై చీదరింపులు, నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.
సామాన్య, మధ్యతరగతి ప్రజలు స్వేచ్ఛగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే వాతావరణం కల్పించాలని, జిల్లా అధికారులు ఈ అంశంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
