ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి యోగ

ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి యోగ

  • 21 వరకు జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు
  • కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం జిల్లాలో ఆదివారం ఘనంగా ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన సంపద లేదని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

భీమవరం పట్టణంలోని ఏఎస్‌ఆర్ సాంస్కృతిక కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 7వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

యోగాభ్యాసం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, సమాజం ఆరోగ్యవంతంగా ఉండేందుకు యోగా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ రెండో శనివారం నరసాపురం వలందర్ రేవులో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 14వ తేదీ ఆదివారం పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో మరో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

జిల్లావ్యాప్తంగా జూన్ 21 వరకు వివిధ మండలాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21వ తేదీ ఉదయం 7 గంటలకు భీమవరంలో జిల్లా స్థాయి యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యోగాపై ఆసక్తి కలిగిన వారికి శిక్షణ అందించేందుకు జిల్లాలో ప్రతి మండలంలో ఒక్కో మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో 50 మందికి యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమాల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

Leave a Reply