ఆలయం వద్దకు ఆర్టీసీకి నో పర్మిషన్…
- బస్సులు నిలిపివేతతో కిలోమీటరు నడవాల్సి వస్తోందని ఆవేదన
- భక్తుల సౌకర్యాల కంటే ఆంక్షలే ఎక్కువా?
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటే, ఆలయం వద్దకే ఆర్టీసీ బస్సులను నిలిపివేయడం వల్ల భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత నెలలో ఆలయం సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతరం, ప్రతి శుక్రవారం, ఆదివారం చెరువుకట్ట సెంటర్ వద్దే ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నారని భక్తులు తెలిపారు. దీంతో చిన్నారులు, వృద్ధులతో వచ్చిన కుటుంబాలు తమ సామాన్లు మోసుకుంటూ సుమారు కిలోమీటరు మేర నడిచి ఆలయానికి చేరుకోవాల్సి వస్తోందని వాపోయారు.
ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే, గత ప్రమాదాన్ని కారణంగా చూపుతున్నారని పేర్కొన్నారు. అయితే ప్రమాదాలు కేవలం ఆర్టీసీ బస్సుల వల్లే జరుగుతాయా? ప్రైవేటు వాహనాలు, ట్రాక్టర్లు, లారీలు, ప్రైవేటు బస్సులు, కార్ల వల్ల ప్రమాదాలు జరగవా? అయితే వాటిని ఆలయం వరకు ఎందుకు అనుమతిస్తున్నారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
గత ఏడాది తిరునాళ్ల సందర్భంగా జేఎన్‌టీయూ వీల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన ఉన్నప్పటికీ, ఈ ఏడాది ఆ ఏర్పాట్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని కూడా వారు గుర్తుచేశారు.
ఇప్పటికైనా ఆలయ అధికారులు, గ్రామ పెద్దలు, సంబంధిత అధికారులతో చర్చించి భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులు ఆలయం వరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
