హజెలో లాబరేటరీస్‌లో ఘోరం

  • రియాక్టర్‌లో పడి ఏజీఎం అనుమానాస్పద మృతి! ..
  • నిబంధనలు బేఖాతరు.. భద్రతా ప్రమాణాలు శూన్యం
  • నాలుగు నెలల క్రితమే ఇద్దరు ఉద్యోగులకు తప్పిన ప్రమాదం.. అయినా మారని వైనం
  • అధికార పార్టీ రాజ్యసభ సభ్యుని పరిశ్రమ కావడంతో చర్యలకు వెనకడుగు?
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన పీసీబీ ఈఈ వెంకన్న;
  • కాలుష్య పరిశ్రమలను తరలించాలని ‘పోరాట సమితి’ డిమాండ్

​ఆంధ్రప్రభ, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని భూదాన్ పోచంపల్లి మండలం, అత్తమ్మ గూడెం గ్రామ సమీపంలో గల ‘హజెలో లాబరేటరీస్’ రసాయన పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) కమ్ షిఫ్ట్ ఇంచార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.వెంకట కృష్ణారెడ్డి (44) రియాక్టర్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భద్రతా ప్రమాణాల లోపం, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

​అపస్మారక స్థితిలో రియాక్టర్‌లో..

​మృతుడు వెంకట కృష్ణారెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. ఆయన భార్య, ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లోని హయాత్‌నగర్‌లో నివసిస్తున్నారు. గత మూడేళ్లుగా ఆయన ఈ హజెలో లాబరేటరీస్‌లో పనిచేస్తున్నారు. అయితే, గత మూడు నెలలుగా వినియోగంలో లేని ఒక రియాక్టర్‌లో గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వెంకట కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే ఆయన్ను బయటకు తీసి, వనస్థలిపురం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై భాస్కర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

​ప్రాణాలు తీస్తున్న విషవాయువులు.. పాత ఘటనలు దాచారా?

​ఈ పరిశ్రమలో భద్రతా లోపాలు ఇప్పుడే కాదు, గతంలోనూ బయటపడ్డాయి. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఇదే రియాక్టర్ వద్ద వెలువడిన విషవాయువుల కారణంగా ఇద్దరు ఉద్యోగులు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నారు. అప్పట్లో వారం రోజుల పాటు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొంది వారు ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా చూసిన యాజమాన్యం.. ప్రమాదానికి గురైన ఆ ఇద్దరు ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పాత ఘటనల నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే నేడు ఏజీఎం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి పీసీబీ.. ఉన్నతాధికారులకు నివేదిక

​ఘటనపై సమాచారం అందుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఈఈ వెంకన్న శుక్రవారం తన సిబ్బందితో కలిసి పరిశ్రమను సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, రియాక్టర్ పరిసరాలను పరిశీలించి, కార్మికులు, ఉద్యోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట కృష్ణారెడ్డి మరణంపై ఆయన తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. రసాయన పరిశ్రమలు నిబంధనలను తుంగలో తొక్కడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సేకరించిన పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందిస్తామని ఈఈ వెంకన్న స్పష్టం చేశారు.

​ఎంపీ అండతోనే ఆటలు? ‘కాలుష్య విముక్తి పోరాట సమితి’ ఆగ్రహం

​ఈ వివాదాస్పద రసాయన పరిశ్రమ అధికార పార్టీకి చెందిన ఒక రాజ్యసభ సభ్యునికి (MP) చెందినది కావడంతోనే.. అధికారులు, యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ​మరోవైపు ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా వెలిసిన రసాయన పరిశ్రమలపై స్థానిక ప్రజలు, కాలుష్య విముక్తి పోరాట సమితి ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.