ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం…

సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ వేగవంతంగా దర్శనాలు
భారీగా తరలివచ్చిన భక్తులు… కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి
రద్దీ దృష్ట్యా అంతరాలయ, వీఐపీ దర్శనాలు తాత్కాలికంగా రద్దు..
క్యూలైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటి సరఫరా…
నిరంతరాయంగా అన్నదానం, ఉచిత ప్రసాదాల పంపిణీ…
ధర్మకర్తల మండలి, అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ…

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : వారాంతపు సెలవులు నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైన్లు భక్తులతో నిండిపోగా, రద్దీని సమర్థంగా నియంత్రిస్తూ సామాన్య భక్తులకు వేగవంతంగా దర్శనం కల్పించేందుకు దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతరాలయ దర్శనాలు, వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు తాగునీరు, అన్నదానం, ప్రసాదాల పంపిణీని విస్తృతంగా నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ యంత్రాంగం సమర్థంగా వ్యవహరించింది.

తెల్లవారుజామునుండే కిక్కిరిసిన క్యూలైన్లు…

ఆదివారం సెలవు దినం నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే ఇంద్రకీలాద్రికి భక్తుల రాక భారీగా పెరిగింది. డీఈఓ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. రద్దీ మరింత పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో ఉదయం 10.30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అదే సమయంలో మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడంతో సామాన్య భక్తులు వేగంగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం లభించింది.

ఎండల నుండి ఉపశమనం..

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం చేపట్టిన మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా క్యూలైన్లలోనే చల్లని తాగునీటి సరఫరా భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సిబ్బంది నేరుగా నీటిని అందించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా ఉచిత ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగించడంతో భక్తులకు మరింత ఉపశమనం లభించింది.

రద్దీని నియంత్రించిన అధికారులు పాలకమండలి సభ్యులు…

మధ్యాహ్నం తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గినప్పటికీ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు క్యూలైన్లలో పర్యటిస్తూ భక్తుల సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. భక్తుల అవసరాలను అడిగి తెలుసుకుంటూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పాలకమండలి, అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా భారీ రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనాలు కొనసాగాయి. దేవస్థానం కల్పించిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు.