మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: డీఎస్పీ నల్లపు లింగయ్య
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో సోమవారం రాష్ట్ర మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు.
రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి మక్తల్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆదివారం మక్తల్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రాంతంతో పాటు బహిరంగ సభ ఏర్పాట్లను డీఎస్పీ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తిప్రాస్‌పల్లి నుంచి మక్తల్ వరకు, కాచ్వర్ నుంచి మక్తల్ వరకు నిర్వహించనున్న బైక్ ర్యాలీ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా మక్తల్ పట్టణంలోని ఐలీన్ స్కూల్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
మంత్రుల పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా ప్రతి అంశాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణలో మక్తల్ సీఐ రామ్‌లాల్, ఎస్‌ఐ పి. రాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
