పారదర్శకంగా, సత్వరంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

పారదర్శకంగా, సత్వరంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
- సీఐ మహేందర్
హసన్ పర్తి, ఆంధ్రప్రభ:
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా సత్వరంగా పూర్తి చేయాలని హసన్ పర్తి సీఐ మహేందర్ సూచించారు. గురువారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని సిద్దాపూర్ మరియు అర్వపల్లి గ్రామాల్లో ఐకెపి నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఐ కొనుగోలు కేంద్రాల సిబ్బందితో , రైతులతో మాట్లాడారు. కొనుగోలు ప్రక్రియ, సమయానుకూల చెల్లింపులు, ధాన్యం నాణ్యత తనిఖీలు రైతులకు అందుతున్న మద్దతు వ్యవస్థల గురించి ఆయన ఆరా తీశారు. రైతుల సమస్యలను విని, ప్రక్రియ సక్రమంగా సాగేందుకు అవసరమైన సూచనలు చేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, పారదర్శకతను పాటించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఐ మహేందర్ స్పష్టం చేశారు.
