మహిళా సాధికారతే మోదీ లక్ష్యం..
- చట్టసభల్లోనూ త్వరలో 33 శాతం రిజర్వేషన్లు
- అందులో భాగంగానే ఆటోలు, కుట్టు మిషన్ల పంపిణీ
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా ఎల్ఎండిలో. ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తో కలిసి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు.

మోదీ స్పూర్తితోనే తాను సైతం ఆటోలు, కుట్టు మిషన్లను పంపిణీ చేస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు, అతి త్వరలోనే చట్ట సభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్లమెంట్, అసెంబ్లీలలో సైతం నూటికి 33 శాతం మంది మహిళా ప్రజా ప్రతినిధులు రాబోతున్నారని చెప్పారు. మహిళలకు సీఎస్సార్ నిధులతో కుట్టు మిషన్ల పంపిణీ చేయడం చాలా సంతోసంగా ఉందని, గతంలోనూ ఆటోలను అందించేశానన్నారు.
దాదాపు వెయ్యి కుట్టు మిషన్లను, ట్రాలీ ఆటోలను కూడా అందించేశామన్నారు. నిజానికి ఇల్లాలు లేనిదే ఇల్లు గడవదని,. మహిళలు లేనిదే స్రుష్టే లేదన్నారు.ఉజ్వల యోజన కింద దాదాపు 9 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి 11 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించామన్నారు. దేశంలో 4 కోట్ల ఇండ్లను నిర్మించి మహిళల పేరిటే అందిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మాత్రు వందన యోజన కింద గర్భిణీ మహిళలకు మొదటి బిడ్డకు 5 వేలు, రెండో బిడ్డ ఆడపిల్ల పుడితే 6 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు.
