ఉచిత యోగా, మెడిటేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత యోగా, మెడిటేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- పతంజలి యోగ సమితి జిల్లా ఉపాధ్యక్షులు పాపయ్య గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మండల పరిధిలోని ఎస్. లింగోటం గ్రామంలో సర్వేజనా సుఖినోభవంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా, మెడిటేషన్ కేంద్రాన్ని విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని పతంజలి యోగ సమితి జిల్లా ఉపాధ్యక్షులు పల్సం పాపయ్య గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం చౌటుప్పల్ పట్టణంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నందున విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా ఈ ఉచిత యోగా శిక్షణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పాపయ్య గౌడ్ కోరారు. మారుతున్న జీవనశైలిలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
నిత్యం యోగా, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడానికి మెడిటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. సర్వేజనా సుఖినోభవంతు ఫౌండేషన్ గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం ఉచితంగా అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని ఎస్. లింగోటం పరిసర ప్రాంత ప్రజలు, యువత ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
