Pavankalayn| పవన్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగ ట్వీట్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆకాంక్షించారు. పవన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బండ్ల గణేష్ తన ట్వీట్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా ప్రస్తావించారు. “సార్, మీరు త్వరగా కోలుకోవాలి. మీరు ఇద్దరూ ఎల్లప్పుడూ బాగుండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. మీ కలయికతో తెలుగు ప్రజలకు మరెన్నో మంచి పనులు జరగాలి. భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇద్దరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది. గతంలోనూ పలుమార్లు పవన్‌పై తన అభిమానాన్ని, గౌరవాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోగ్యంపై ఆయన చేసిన తాజా ట్వీట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్‌కు జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజా సేవలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ పలువురు సోషల్ మీడియాలో సందేశాలు పోస్టు చేస్తున్నారు.

