మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
- డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని లోక్యాతండా, గోల్ బోడుక తండా, నరసింహపురం బంజర లాలితండా, జయపురం కొమ్ములవంచ గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల నూతన భవనాల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఉపాధి హామీ (NREGS) నిధులతో పూర్తి చేసిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నియోజకవర్గ అభివృద్ధికి రూ. 600 కోట్ల నిధులను తీసుకువచ్చానని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి రూ. 50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ కళాశాల కొరకు రూ. 30 కోట్లు, మరిపెడలో రూ. 36 కోట్లతో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
నర్సింహులపేటలోని పీఎం శ్రీ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చడానికి రూ. 3 కోట్లు, కురవి ఇంటిగ్రేటెడ్ కళాశాలకు రూ. 15 కోట్లు మంజూరయ్యాయని ఆయన వివరించారు. ఇందిరా శక్తి మహిళా సంఘాల భవనాల కొరకు రూ. 15 కోట్లు రాగా నేడు ఐదు భవనాలకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తున్నామని స్పష్టం చేశారు. జూన్ నెల నుండి పింఛన్ల పెంపుతో పాటు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో రాధిక, ఎంపీఓ కిన్నర యాకయ్య, ఏపీఎం రాములు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరోజు రాజశేఖర్, జిల్లా అడ్వైజర్ ఇర్రి లింగారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుగులోత్ బాబురావు, వివిధ గ్రామాల ప్రతినిధులు పెదమాముల యాకయ్య, రాజేందర్ నాయక్, వీరునాయక్, పుప్పాల రవీందర్, పీసీఎస్ డైరెక్టర్ పోలేపల్లి రజనీకాంత్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు దసృ నాయక్, అలువాల శ్రీనివాస్, వెన్నం రవీందర్ రెడ్డి, కడుదల రామకృష్ణ, రేఖ అనిల్, చిర్ర సతీష్ గౌడ్ పాల్గొన్నారు.
