ఉద్యోగం చేస్తారా.. సస్పెండ్ చెయ్యాలా..?

ఉద్యోగం చేస్తారా.. సస్పెండ్ చెయ్యాలా..?
ధాన్యం కొనుగోళ్ల వివరాలు, గన్నీ సంచుల పంపిణీపై అసహనం
ఏవో, ఏఈఓలు, పిఎసిఎస్ సీఈవోలపై ఆగ్రహం
విధుల నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు
కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహశబరిస్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఉద్యోగం చేస్తారా.. సస్పెండ్ చెయ్యాలా..మీలో ఎవరిని సస్పెండ్ చేయాలో మీరే చెప్పాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహశబరిస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కలు,ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి రైతులు మక్కలు ఎన్ని తీసుకువచ్చారు.. ఎన్ని కాంటాలు అయినవి.. ఇంకా ఎన్ని మిగిలి ఉన్నవి అని స్థానిక వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్ ను, ఏఈఓ లు కళ్యాణి, మౌనికలను ప్రశ్నించగా వారు ఒకరి మీద ఒకరు.. వారి దగ్గర ఉన్నవి వీరి దగ్గర ఉన్నాయని సమాధానం చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు ఉద్యోగం చేస్తున్నారా.. ఏం చేస్తున్నారు..
అంటూ సస్పెండ్ చేయాల మీలో ఎవరిని చేయాలో మీరే చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు.త్వరగతిన మొక్కజొన్న నిల్వలను తరలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రవాణా సదుపాయం కల్పించేలా ట్రాక్టర్లు, లారీలు ఏ వాహనాలు లభిస్తే వాటితో మొక్కజొన్న తరలించి చర్యలు చేపట్టాలన్నారు. గన్నీ బస్తాల సమస్యపై రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.వాతావరణ పరిస్థితులతో ధాన్యాన్ని కూడా వెంటనే తరలించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెదమాముల యాకయ్య, ఆమె వెంట సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారులు రమేష్,మేనేజర్ నరసింహారావు, తహశీల్దార్ రమేష్ బాబు,మండల పంచాయతీ అధికారి కిన్నర యాకయ్య, వ్యవసాయ శాఖ అధికారులు వినయ్ కుమార్,ఏఈవో లు మౌనిక,కళ్యాణి స్థానిక ఎస్సై వెంకన్న తదితరులు ఉన్నారు.
