peddi | జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

peddi | జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

థియేటర్లలో ఘన విజయం
రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు ఇంటి వద్దే వినోదం
తెలుగు సహా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల..
హిందీ వెర్షన్ మాత్రం జూలై 30 నుంచి అందుబాటులోకి

peddi | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, జూలై 9 నుంచి తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

థియేటర్లలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘పెద్ది’ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌చరణ్ కెరీర్‌లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచిన ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో క్రీడలు, భావోద్వేగాలు, సామాజిక అంశాలను మేళవిస్తూ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూలై 9, 2026 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. హిందీ వెర్షన్ మాత్రం జూలై 30 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో ఆదరణ పొందుతుందనే అంచనాలు ఉన్నాయి.

సినిమా కథ ఇదే..
విజయనగరం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం కథతో సినిమా ప్రారంభమవుతుంది. వందలాది మంది నివసిస్తున్నా ప్రభుత్వ రికార్డుల్లో ఆ గ్రామానికి గుర్తింపు ఉండదు. ఆ కారణంగా అక్కడి ప్రజలు వివక్షను ఎదుర్కొంటూ జీవనం సాగిస్తుంటారు. అలాంటి గ్రామంలో పుట్టి పెరిగిన యువకుడే పెద్ది (రామ్‌చరణ్). జీవనోపాధి కోసం రోజూ విజయనగరానికి వెళ్లి కూలి పని చేస్తుంటాడు. అయితే అతని అసలైన ప్రతిభ క్రికెట్‌లో ఉంటుంది. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరొందిన అతడిని విజయనగరం, బొబ్బిలి జట్లు వేలంలో దక్కించుకునేందుకు పోటీ పడతాయి. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదగల సత్తా ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్న పెద్ది, ‘ఆట కూలీ’గా గుర్తింపు పొందుతాడు. అయితే పరిస్థితుల ప్రభావంతో క్రికెట్‌కు దూరమై కుస్తీ క్రీడాకారుడిగా మారాల్సి వస్తుంది. ఆ నిర్ణయం వెనుక కారణాలేంటి? అచ్చియమ్మ (జాన్వీ కపూర్) పాత్ర అతని జీవితాన్ని ఎలా మలిచింది? తన గ్రామానికి గుర్తింపు తీసుకురావడానికి పెద్ది చేసిన పోరాటం ఏమిటి? గ్రామ గౌరవం కోసం అతను చేసిన త్యాగాలేంటి? అనే అంశాల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది. భావోద్వేగాలు, గ్రామీణ జీవన శైలి, క్రీడా నేపథ్యం, యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ‘పెద్ది’ సినిమా థియేటర్లలో మంచి ఆదరణ పొందగా, ఇప్పుడు ఓటీటీలో మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.