పుట్టపర్తికి చేరుకున్న వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్

జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : వెనిజులా వైస్ ప్రెసిడెంట్ Delcy Rodríguez శనివారం ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె రాక సందర్భంగా జిల్లా పరిపాలనా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. విమానాశ్రయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెకు సాదర ఆహ్వానం అందించారు.

జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అదనపు ఎస్పీ అంకిత సురన, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణతో పాటు ఇతర ఉన్నతాధికారులు విమానాశ్రయంలో ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమర్పించి ఆతిథ్య మర్యాదలు చేశారు. వైస్ ప్రెసిడెంట్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత భద్రతా చర్యలు చేపట్టింది.

విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, రాకపోకలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రముఖ నాయకురాలు పుట్టపర్తికి రావడం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఆమె పర్యటన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాల గురించి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని వైస్ ప్రెసిడెంట్‌కు స్వాగతం పలికారు. పుట్టపర్తి విమానాశ్రయం సందర్శకులతో సందడిగా మారింది.