ప్రమాదాలపై బ్రేక్.. భద్రతపై ఫోకస్
గతేడాదితో పోలిస్తే ప్రమాదాలు 30%, మరణాలు 32% తగ్గింపు
రహదారి భద్రతపై జిల్లా స్థాయి సమీక్షలో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్
పుట్టపర్తి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలు ఫలితాలిస్తున్నాయని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా రహదారి భద్రత సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని హరిపురం జంక్షన్, పుట్టపర్తి క్రాస్, దామాజీపల్లి, దుద్దెబండ క్రాస్ సహా మొత్తం 26 ప్రమాద ప్రాంతాలను గుర్తించి అక్కడ రంబుల్ స్ట్రిప్స్, సోలార్ లైట్లు, రిఫ్లెక్టివ్ స్టడ్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.
రహదారులపై గుంతల పూడ్చివేత, దెబ్బతిన్న ప్రాంతాల మరమ్మతులు పూర్తి చేసినట్లు తెలిపారు. బత్తలపల్లి ఆర్‌డీటీ ఆసుపత్రి, ఎంఆర్వో కార్యాలయం పరిసరాలు, తాడిపత్రి రోడ్డులో అవసరమైన చోట ఫ్లాషింగ్ లైట్లు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమీక్ష సందర్భంగా ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట డెలినేటర్లు అమర్చాలని కలెక్టర్ ఆదేశించారు. లేపాక్షి నుంచి జాతీయ రహదారిపైకి నేరుగా వాహనాలు ప్రవేశించకుండా లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కోరేవాండ్లపల్లి, గోరంట్ల, రెడ్డిచెరువు కట్ట ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
జాతీయ రహదారుల మీడియన్లలో ఉన్న విగ్రహాలు లేదా ఇతర నిర్మాణాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయం, నిరంతర నిఘా వల్ల జిల్లాలో రహదారి ప్రమాదాల రేటు గణనీయంగా తగ్గిందని అధికారులు వెల్లడించారు. 2025 జనవరి-మే కాలంతో పోలిస్తే 2026 జనవరి-మే నాటికి రహదారి ప్రమాదాలు 30 శాతం, ప్రమాద మరణాలు 32 శాతం తగ్గినట్లు సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్టీఓ కరుణసాగర్, పోలీసు, రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఐఆర్‌ఏడీ, వైద్య, విద్యాశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
