రహదారి వనం కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ..
రహదారి వనం కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ..
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు ఉన్న రహదారి వనం (Roadside Plantation) మార్గంలో సుమారు 330 మొక్కలను ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు కలిసి నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పుట్టపర్తిని హరిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్వో చక్రపాణి, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు. రహదారి పొడవునా పచ్చదనం వెల్లివిరిసేలా అటవీశాఖ చేపట్టిన ఈ చొరవను స్థానికులు అభినందించారు.
