‘అరైవ్ అలైవ్’ స్పెషల్ డ్రైవ్‌తో ట్రాఫిక్ నిబంధనలపై కఠిన చర్యలు

ప్రజల సహకారంతోనే ప్రమాదరహిత సమాజం : ఎస్పీ సంకీర్త్, ఆర్టీవో శ్రీనివాస్

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ, రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ‘అరైవ్ అలైవ్’ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లా రవాణా శాఖ అధికారి బరగడి శ్రీనివాస్ స్వయంగా తనిఖీల్లో పాల్గొని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించారు.

మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్ల కలిగే ప్రమాదాలను వివరించి, భవిష్యత్తులో అలాంటి తప్పిదాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన పెంపొందించే లక్ష్యంతో వినూత్న విధానాన్ని అమలు చేశారు. తనిఖీల్లో పట్టుబడిన వాహనాలకు జరిమానాలు విధించినప్పటికీ, ఆయా వాహనాలు ఏ జిల్లాకు చెందినవో ఆ జిల్లా ఆర్టీవో కార్యాలయంలోనే జరిమానా చెల్లించేలా రసీదులు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై మరింత అవగాహన పెరుగుతుందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఆర్టీవో బరగడి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సీటుబెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

ప్రతి వాహనదారుడు ఐఎస్‌ఐ ప్రమాణాల హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం, ట్రాఫిక్ సంకేతాలను పాటించడం, వేగ పరిమితులను అధిగమించకుండా ఉండడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.

రోడ్డు భద్రత పోలీసు, రవాణా శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే ప్రమాదరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటిస్తూ ‘అరైవ్ అలైవ్’ స్పెషల్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ నరేష్‌కుమార్, ఎస్‌ఐలు, మోటారు వాహనాల తనిఖీ అధికారులు (ఎంవీఐలు), ఆర్టీవో, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.