వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ, ఆంధ్రప్రభ ; రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి సెలవులు మరియు సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా నెలకొంది. “కోరిన కోర్కెలను కొంగు బంగారంగా తీర్చే రాజన్న–భీమన్న” అనే విశ్వాసంతో తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం సరస్వతి నది అంత్య పుష్కరాలు, సమ్మక్క సారలమ్మ జాతర, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే ముందు వేములవాడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీగా భక్తులు భావిస్తున్నారు. ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు, సంతానప్రాప్తి, నూతన దంపతుల శుభజీవితం, కుటుంబ సౌఖ్యం వంటి కోరికలు స్వామివారిని ప్రార్థిస్తే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
కోరికలు తీరిన అనంతరం భక్తులు తలనీలాలు, కోడెమొక్కులు, రుద్రాభిషేకాలు, అన్నపూజలు, నిత్య కళ్యాణాలు, చండీ హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, మహాలింగార్చనలు, ఆకుల పూజలు తదితర మొక్కులు చెల్లిస్తున్నారు. అలాగే స్వామివారిపై విశ్వాసమున్న భక్తులు ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధికి తమ వంతు సహాయంగా విరాళాలు కూడా సమర్పిస్తున్నారు. భక్తులు స్వామివారికి తులాభారంగా బెల్లం, చక్కెర, ఇతర నైవేద్యాలను సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.
ఆలయానికి వచ్చిన భక్తుల కోసం నిత్య అన్నదాన సత్రంలో ఉదయం 6 గంటల నుండి 10:30 గంటల వరకు అన్నసత్ర టికెట్లు ఆలయ ప్రచార శాఖలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. స్వామివారి నివేదన అనంతరం నిత్య అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. సోమవారం సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి ఆలయంలో క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం, అభిషేక టికెట్ల కౌంటర్లు, అద్దె కోడెల విభాగం తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భాస్కర శర్మ, ఆలయ ఏఈఓ జి. శ్రావణ్, ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
