ప్రజల సహకారంతో శాంతి భద్రతలు కాపాడుదాం
ప్రజల సహకారంతో శాంతి భద్రతలు కాపాడుదాం
- ఎస్‌ఐ తోట తిరుపతి
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల ప్రజలతో సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని ఎస్‌ఐ తోట తిరుపతి అన్నారు. మండలానికి నూతనంగా ఎస్‌ఐ గా బాధ్యతలు స్వీకరించిన తోట తిరుపతి ఈ రోజు పోలీస్ స్టేషన్‌లో పత్రికా సమావేశం నిర్వహించారు. ప్రజల సహకారం లేకుండా పోలీసింగ్ సమర్థవంతంగా సాగదని, అందరూ చట్టాలను గౌరవించి సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువత మైనర్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అలాంటి చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, వేధింపులపై వెంటనే స్పందిస్తామని హామీ ఇచ్చారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు చెరువులు, బావులు, కాలువల వద్ద ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుకోని ప్రమాదాలు నివారించేందుకు గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కాలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇళ్లలో భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, పొరుగువారితో పరస్పర సహకారం పెంచుకోవడం ద్వారా నేరాలను నివారించవచ్చన్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని, వాటిని పంచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా అక్రమంగా ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. ప్రజలు పోలీస్ శాఖపై నమ్మకం ఉంచి, సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని కోరుతూ, “పోలీస్ – ప్రజల స్నేహబంధం బలపడితేనే సమాజం సురక్షితంగా ఉంటుంది” అని అన్నారు.
