జీవో 673ను వెంటనే రద్దు చేయాలి: సీపీఎం డిమాండ్

జీవో 673ను వెంటనే రద్దు చేయాలి: సీపీఎం డిమాండ్

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 673 ద్వారా పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ప్రజా సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, ఇది ప్రజా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే నిర్ణయమని సీపీఎం మచిలీపట్నం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం విమర్శించారు. ప్రమాదకరమైన జీవో 673ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో నీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలు ప్రజల ప్రాథమిక హక్కులని తెలిపారు. వీటిని ప్రైవేటీకరించడం వల్ల సేవల పేరుతో అధిక చార్జీలు వసూలు చేసి ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపే ప్రమాదం ఉందన్నారు.

ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలపై మరిన్ని భారాలు మోపే విధానాలను ప్రభుత్వం నిలిపివేయాలని కోరారు. పట్టణ స్థానిక సంస్థలకు తగిన నిధులు, సిబ్బంది కేటాయించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

జీవో 673ను తక్షణమే రద్దు చేయాలని, పట్టణాల ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని సీపీఎం మచిలీపట్నం నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, ప్రజాసంఘాలను కలుపుకొని విస్తృత ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించింది.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చెప్పు రాజేష్, సీపీఎం సీనియర్ నాయకులు కొడాలి శర్మ తదితరులు పాల్గొన్నారు.