పోలీస్ శాఖలో అవినీతి?

పోలీస్ శాఖలో అవినీతి?

  • ఏసీబీకి పట్టుబడ్డ తిమ్మాజీపేట ఎస్సై
  • పోస్టింగ్లకు పైరవీలు
  • పర్వేక్షణాలోపమా లేదా
  • ప్రజాసేవలో చిత్తశుద్ధి ఏది??
  • నియమ నిబంధనలు అమలు ఏది?
  • ఇసుక, బుధందా, తగాదాలు, ఫైనాన్స్ ,సెటిల్మెంట్లు పోలీసుల చేతివాటం

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ శాఖలో అవినీతి రాజ్యమేలుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక దందా, ల్యాండ్ సెటిల్‌మెంట్లు, ఫైనాన్స్ వ్యవహారాలు, తగాదాలు, రాజీమార్గాల పరిష్కారాల వంటి అంశాల్లో పోలీస్ స్టేషన్‌కు వెళ్తే “చేతివాటం” తప్పనిసరిగా ఉంటుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాలను మినహాయిస్తే, చాలా వ్యవహారాల్లో పోలీసుల అవినీతి బహిరంగ రహస్యంగా మారిందని స్థానికులు అంటున్నారు.

జిల్లా ఏర్పాటు తరువాత నాగర్ కర్నూల్‌లో ఎస్పీ కార్యాలయం, ప్రతి రెవెన్యూ సబ్‌డివిజన్‌లో డీఎస్పీ కార్యాలయాలు, తాలూకా స్థాయిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు, ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటయ్యాయి. ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, న్యాయం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పోలీసులు చేరువైనప్పటికీ, సేవలతో పాటు అవినీతి కూడా పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా నాగర్ కర్నూల్ ప్రాంతంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది. దుందుభిన్న పరివాహక ప్రాంతంలోని గ్రామాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు కొనసాగుతుండటం బహిరంగ రహస్యం.

ఈ అక్రమ వ్యాపారం కొనసాగడానికి రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలకు నెలవారీగా మామూలు చెల్లింపులు జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ఒక ట్రాక్టర్ ఇసుకకు సంబంధిత పోలీస్ స్టేషన్‌తో పాటు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు రూ.5,000 నుండి రూ.15,000 వరకు ముడుపులు చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది.

ఆన్‌లైన్ ఇసుక విధానం అమల్లో ఉన్నప్పటికీ, అది పేరుకే పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఇసుక ధర దూరాన్ని బట్టి రూ.4,000 నుండి రూ.4,500 వరకు ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.5,000 నుండి రూ.5,500 వరకు అమ్ముతున్నారు. సరఫరా తగ్గితే ధరలు పెరుగుతున్నాయి. ఈ వ్యాపారం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా, అధికారులు మారినా ఇసుక మాఫియా ఆగడం లేదని స్థానికులు అంటున్నారు.

ఈ అక్రమాలను అరికట్టాల్సిన పోలీస్, రెవెన్యూ అధికారులు స్వయంగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐల నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వరకు ముడుపులు అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

ప్రతి నెల ఎస్పీ ఆధ్వర్యంలో ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయిలో సమీక్షలు జరుగుతున్నప్పటికీ, ఈ అవినీతి విషయాలు తెలియవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ఇంటెలిజెన్స్, సీక్రెట్ బ్రాంచ్ వంటి విభాగాలు కూడా ఈ విషయాలను పై అధికారులకు తెలియజేయడంలో విఫలమవుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఇసుక, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న ప్రాంతాల్లో ఎస్ఐ పోస్టింగుల కోసం పోటీ పెరిగి, పైస్థాయిలో ముడుపులు చెల్లించి పోస్టులు పొందుతున్నారని విమర్శలు ఉన్నాయి. జిల్లా అధికారులు ఈ అంశాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించకపోవడంతో బాధితులు ఎసీబీ అధికారులను ఆశ్రయిస్తున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తిమ్మాజీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ, మైనింగ్ అధికారులకు జరిమానా చెల్లించిన ట్రాక్టర్, జేసీబీ విడుదల కోసం రూ.30,000 లంచం అడిగి, రూ.20,000 స్వీకరిస్తుండగా ఎసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటువంటి ఘటనలు మరెన్నో చోట్ల వెలుగుచూస్తున్నాయి.

ఇసుక వ్యాపారంలో అక్రమాలు జరుగుతున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ, వాటిని అరికట్టడంలో జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇసుక వ్యాపారం జరుగుతున్న ప్రాంతాల్లో సబ్ ఇన్స్పెక్టర్లు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.