అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవం..

అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవం..

108 సిబ్బంది చాకచక్యం
సకాలంలో స్పందించిన సిబ్బంది
తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన ఈఎంఎటీ, పైలట్

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవం చేయించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారు. పెనుగంచిప్రోలు పట్టణానికి చెందిన జక్కులూరి రాజేశ్వరి (25)కు గురువారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

వెంటనే 108 అంబులెన్స్‌లో జగ్గయ్యపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రంగా పెరిగాయి. పరిస్థితిని గమనించిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కే. జ్యోతి, పైలట్ శ్రీను అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌లోనే డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. అనంతరం నవజాత శిశువుకు తగిన చికిత్స అందిస్తూ, ఆక్సిజన్ అందించి తల్లీబిడ్డలను సురక్షితంగా పెనుగంచిప్రోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలను కాపాడిన 108 సిబ్బందిని ఆస్పత్రి వైద్యులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

Leave a Reply